చాయ్ విత్ అజ‌ర్ భాయ్‌.. బెడిసికొట్టెనోయ్‌!

తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌రైన ప్ర‌ణాళిక‌, వ్యూహంతో ముందుకు సాగితే ఈ సారి బీఆర్ఎస్ బ‌దులు కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌కు పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాలే ఇబ్బందిగా మారాయి. తాజాగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ చేప‌ట్టిక కార్య‌క్ర‌మం ర‌చ్చ‌ర‌చ్చ అయింది.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు అజ‌హ‌రుద్దీన్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే  ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో చాయ్ విత్ అజ‌ర్ భాయ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కానీ ఆయ‌న్ని నియోజ‌క‌వ‌ర్గంలో తిరగ‌నీయ‌కుండా మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అనుచ‌రులు అడ్డుకోవ‌డం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. రెండు గంట‌ల పాటు అజ‌హ‌రుద్దీన్‌ను కారు దిగ‌కుండా విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అనుచ‌రులు అడ్డుకోవ‌డం తీవ్ర క‌ల‌కలం రేపింది.

చివ‌ర‌కు పోలీసుల లాఠీఛార్జీ చేసి వాహ‌నాల‌ను అక్క‌డి నుంచి పంపించారు. అజ‌హ‌రుద్దీన్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కుండానే వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. దీంతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. ఈ సారి ఎమ్మెల్యే టికెట్ త‌న‌కే ద‌క్క‌తుంద‌ని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆశ‌లు పెట్టుకున్నారు. పి.జనార్ధ‌న్‌రెడ్డి అకాల మ‌ర‌ణంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విష్ణువ‌ర్ధ‌న్ 2004 ఉప ఎన్నిక‌లు, 2009 ఎన్నిక‌ల్లో ఖైర‌తాబాద్ నుంచి గెలిచారు. కానీ కొత్త‌గా ఏర్ప‌డ్డ జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2018లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో  ఈ సారి అక్క‌డ అజ‌హ‌రుద్దీన్‌ను నిల‌బెట్టాల‌న్న‌ది పార్టీ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. కానీ విష్ణువ‌ర్ధ‌న్ మాత్రం ఆ స్థానాన్ని వ‌దులుకునేలా లేరు. మ‌రి పార్టీ ఏం చేస్తుందో చూడాలి.