తిరుపతి నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు అధికార వైసీపీ వేట మొదలెట్టింది. తిరుపతిలో వైసీపీ అంటే భూమన కరుణాకర్‌రెడ్డి పేరే గుర్తుకు వచ్చేది. అంతలా ఆ నియోజకవర్గంలో ఆయన పట్టు సాధించారు. మరోవైపు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కూడా కావడంతో భూమన జోరు కొనసాగింది. కానీ 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని భూమన చెప్పారు. అన్నట్లే 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని తెలిసింది.
ఇక భూమన కరుణాకర్‌రెడ్డి స్థానంలో తిరుపతిలో వైసీపీ తరపున పోటీ చేసేది ఎవరనే ప్రశ్న కలుగుతోంది. ఇందుకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు కరుణాకర్‌రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి. రెండో వ్యక్తి మేయర్ డాక్టర్ శిరీష. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికైన శిరీషకు పార్టీ మేయర్ పదవి కట్టబెట్టింది. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, పైగా తిరుపతిలో బలిజ తెగలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం శిరీషకు కలిసొస్తుందని అంటున్నారు. ఓసీ, మైనార్టీల్లోనూ ఆమెకు మంచి పేరుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన భూమన అభినయ్ రెడ్డి మున్సిపల్ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మంచి నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలనూ తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయవంతమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పని చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే ఈ సారి తిరుపతి వైసీపీ సీటు కచ్చితంగా అభినయ్ రెడ్డికే దక్కుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శిరీష కంటే కూడా అభినయ్‌కే జగన్ అవకాశం ఇచ్చే ఆస్కారముందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates