ఒక్క టికెట్‌.. ముగ్గురు నేత‌లు

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ను గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్న కాంగ్రెస్‌కు సొంత నాయ‌కుల మ‌ధ్య విభేదాలు స‌మ‌స్య‌గా మారాయి. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ నాయ‌కుల మ‌ధ్య పోటీ నెల‌కొంది.  దీంతో ఈ టికెట్ల వ్య‌వ‌హారం టీపీసీసీకి త‌ల‌నొప్పిగా మారింది. కామారెడ్డి జిల్లాలోని జుక్క‌ల్ నియోజవ‌క‌ర్గంలోనూ కాంగ్రెస్‌కు ఇలాంటి ప‌రిస్థితే ఉంది. ఇక్క‌డ టికెట్ కోసం ముగ్గురు నేత‌లు పోటీప‌డుతున్నారు.

ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన జుక్క‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్ద‌రు నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇక్క‌డ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత సౌద‌గ‌ర్ గంగారం ఉన్నారు. జుక్క‌ల్ నుంచి ఏడు సార్లు పోటీ చేసిన ఆయ‌న నాలుగు సార్లు విజ‌యం సాధించారు. అయితే గ‌త రెండు ఎన్నిక‌ల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్య‌ర్థి హ‌న్మంత్ షిండే చేతిలో ఓడిపోయారు. జుక్క‌ల్‌పై ప‌ట్టు ఉండ‌డం, పైగా రెండు సార్లు ఓడిపోయార‌నే సానుభూతి కూడా ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంపై గంగారం ధీమాగా ఉన్నారు. కానీ టికెట్ కోసం ఆయ‌నకు పోటీగా మ‌రో ఇద్ద‌రు ఉన్నారు.

ఒక‌ప్పుడు ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన గ‌డుగు గంగాధ‌ర్ కూడా జుక్క‌ల్ టికెట్ ఆశిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూ ఉనికి చాటుకోవాల‌నుకుంటున్నారు. ఇక్క‌డ ఆయ‌న ఆఫీస్ కూడా ప్రారంభించారు. మ‌రోవైపు ఎన్ఆర్ఐ ల‌క్ష్మీకాంత్‌రావు కూడా టికెట్‌పై కన్నేశారు. తొమ్మ‌ది నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇలా ముగ్గురు నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. కానీ వీళ్ల‌లో ఎవ‌రికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇస్తుందో చూడాలి.