రాజ‌న్న చోటులో.. రామ‌న్న దృష్టి

తెలంగాణ ఎన్నిక‌ల‌పై పార్టీల‌న్నీ దృష్టి పెట్ట‌డంతో సంద‌డి మొద‌లైంది. అధికార బీఆర్ఎస్ మూడో సారి విజ‌యంపై క‌న్నేసింది. ఈ నేప‌థ్యంలో పార్టీలోని అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తూ ఎన్నిక‌ల నాటికి ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవాల‌ని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పార్టీలో అగ్ర‌నేత కేటీఆర్ ఈ బాధ్య‌త‌లు భుజాన వేసుకుని పార్టీ నాయ‌కుల మ‌ధ్య దూరాన్ని, వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించిన‌ట్లు తెలిసింది.

 రాజ‌న్న స‌న్నిధాన‌మైన వేముల‌వాడ‌పై ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోక‌స్ పెట్టారు. పార్టీ క్యాడ‌ర్ చేజార‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇక్క‌డ బీఆర్ఎస్ నుంచి చెన్న‌మ‌నేని ర‌మేశ్‌బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయ‌న‌పై పౌర‌స‌త్వ వివాదం ఉంది. ఆయన్ని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌నే కేసుపై విచార‌ణ సాగుతోంది. మ‌రోవైపు ఆయ‌నపై సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీలోనే వ్య‌తిరేక‌త నెల‌కొంది.

ఇద్ద‌రు లీడ‌ర్లు చ‌ల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహ‌రావు, ఏనుగు మనోహ‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త‌తో బ‌హిరంగ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.  వీళ్లు ఎవ‌రికి వారే టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో చ‌ల్మెడ ఏకంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు వేముల‌వాడ‌లో ర‌మేశ్‌బాబుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వ‌ల్ప తేడాతో గెలిచారు.

దీంతో ఈ సారి ఆయ‌న్ని త‌ప్పించేందుకు వీలుగానే చ‌ల్మెడ‌, మ‌నోహ‌ర్‌రెడ్డిని కేటీఆర్ ప్రోత్స‌హిస్తున్నారే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీ క్యాడ‌ర్ దెబ్బ‌తిన‌కుండా చూసుకుంటూనే.. ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి టికెట్‌, మ‌రొక‌రికి నామినేట్ ప‌ద‌వి ఇచ్చేలా కేటీఆర్ వ్యూహం ప‌న్నార‌ని తెలిసింది.