కలకలం… మోదీ స్టేట్ సిటీలు సహా ఐదు నగరాల్లో కరోనా విలయం

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్… భారత్ లో అంతకంతకూ తన విస్తృతిని పెంచేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలకు పైగా నమోదు కాగా… దేశంలోని పలు కీలక నగరాల్లో వైరస్ విస్తృతి ఓ రేంజిలో ఉంది. ఇలా కరోనా విస్తృతి శృతి మించిన నగరాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గంగా పేరొందిన అహ్మదాబాద్ సహా గుజరాత్ లోని సూరత్ కూడా చేరిపోయాయి. గుజరాత్ వాణిజ్య రాజధానిగా పేరొందిన అహ్మదాబాద్ తో పాటు దేశంలోనే వస్త్ర వ్యాపారానికి కేంద్ర బిందువుగా పేరొందిన సూరత్ కూడా కరోనా విలయం తాండవం చేస్తున్న నగరాల జాబితాలో చేరిపోవడం నిజంగానే ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో ఆ రెండు నగరాలతో పాటు కరోనా విస్తృతి అమాంతంగా పెరిగిపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు తమిళనాడు రాజధాని చెన్నై, మహారాష్ట్రలోని కీలక నగరం థానేల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగిపోయాయి.

ఈ తరహాలో 10 కేంద్ర బృందాలు ఇప్పటికే ఏర్పాటు కాగా.. వాటిలో ఐదు బృందాలను ముంబై, పుణే (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్), జైపూర్ (రాజస్థాన్), కోల్ కతాతో పాటు ఆ నగరం పరిసర పట్టణాలు(పశ్చిమ బెంగాల్)లకు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో కరోనా వైరస్ విస్తృతి ఓ రేంజికి చేరిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా ఐదు కేంద్ర బృందాలను ఏర్పాటు చేసి హుటాహుటీన ఆ నగరాలకు పంపింది. ఈ బృందాలు ఆయా నగరాల్లో పర్యటించి.. అక్కడి తాజా పరిస్థితులను అధ్యయనం చేసి… కరోనా కట్టడికి ఏమేం చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడంతో పాటుగా సదరు నివేదికలను కేంద్రానికి నివేదించనున్నాయి. అసలు ఈ నగరాల్లోనే కరోనా విలయతాండవం చేసేందుకు గల కారణాలు ఏమిటన్న విషయంపై కేంద్ర బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి.

దేశంలో కరోనా కట్టడి కోసం ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేసినా… కీలక నగరాల్లో వైరస్ వ్యాప్తికి ఇంకా చెక్ పడకపోవడం ఆందోళన రేకెత్తించే అంశమే. ఓ వైపు లాక్ డౌన్ ను పక్కాగానే అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా… మోదీ సొంత రాష్ట్రానికి చెందిన రెండు కీలక నగరాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరడం నిజంగానే ఆందోళన రేకెత్తించేదే. దేశంలోనే పారిశ్రామికంగా కీలక రాష్ట్రంగా ఉన్న గుజరాత్ లో.. ఆ రాష్ట్ర వాణిజ్య నగరం అహ్మదాబాద్ లో వైరస్ వ్యాప్తికి చెక్ పడకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లుగానే భావించాలి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రత్యేకంగా కేంద్ర బృందాలను రంగంలోకి దించిందని చెప్పాలి. మరి ఈ కేంద్ర బృందాల అధ్యయనం తర్వాతైనా అహ్మదాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ఏ మేర కట్టడి పడుతుందో చూడాలి. అదే విధంగా అహ్మదాబాద్ తరహాలోనే తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్న హైదరాబాద్, చెన్నై, సూరత్, థానేల్లో పరిస్థితిని ఎలా అదుపు చేస్తారో చూడాలి.