నిలదీయడానికి కాదు..వెన్ను తట్టడానికి వచ్చా: సీఎం జగన్!

అల్లూరి జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయన్నారు.

మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పామన్నారు. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి.. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశామని తెలిపారు.

తాను అధికారులను నిలదీయడానికి రాలేదని.. అధికారులకు శభాష్‌ అని చెప్పి.. వెన్ను తట్టి బాగా చేశారని చెప్పడం కోసం వచ్చానని చెప్పారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అందరూ ఇక్కడే ఉన్నారని అన్నారు.

సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్‌ వ్యవస్థ దాకా యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరూ సాయం అందకుండా ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే తప్పే. అలా జరగకపోతే ఎవరైనా నాకు చెప్పవచ్చు.

“ఈసారి వరద వచ్చినప్పటికీ అప్పటికప్పుడు నేను వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, సరైన సమయం ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో వాళ్లంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇంటినీ మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికీ సహాయం అందించే కార్యక్రమం చేశారు. ఇంతకు ముందూ ఇదే చేశాం. ఇప్పుడూ చేస్తున్నాం.

పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఎన్యుమరేషన్‌ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే. ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం.. ఇంకా ఎవరికైనా సాయం అందకపోతే నాకే చెప్పండి” అని సీఎం జగన్ తెలిపారు.

ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్‌ అయిపోయి ఉంటే.. ఆ ఇళ్లకు రేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, పాలు, కూరగాయలు ఇటువంటివన్నీ 5 రకాలు కలిపి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆదేశించాం. అటువంటివి ఎవరికైనా దక్కకపోయి ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం జవాబుదారీ తనం తీసుకుంటుంది. కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియల్లీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దు.

వారం తర్వాత తిరిగి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. సహాయం అందలేదని ఏ కుటుంబం కూడా చెప్పకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అధికారులు సరిగ్గా వ్యవహరించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం వైసీపీ ప్రభుత్వంలో లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.