భూమా కుటుంబంలో రాజ‌కీయ చిచ్చు.. ఏం జ‌రుగుతుంది..?


భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి-భూమా జ‌గ‌త్‌విఖ్యాత‌రెడ్డి-భూమా మౌనికారెడ్డి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో విఖ్యాత్‌రెడ్డి-మౌనిక అక్కాత‌మ్ముళ్లు. బ్ర‌హ్మానంద‌రెడ్డి.. ఈ కుటుంబం మ‌లిచిన రాజ‌కీయ నాయ‌కుడు. 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో హ‌ఠాత్తుగా రాజ‌కీయ తెర‌మీద‌కు వ‌చ్చిన నాయ‌కుడు బ్ర‌హ్మానంద‌రెడ్డి. అయితే.. ఆయ‌నేమీ.. టెంప‌ర‌రీ కోసం రాలేద‌ని.. స్వ‌యంగా చెప్పారు. 2019లో టికెట్ వివాదం ఏర్ప‌డిన‌ప్పుడు.. స్వతంత్రంగా పోటీ చేస్తాన‌ని కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

పాల‌వ్యాపారి కావ‌డంతోపాటు.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న బ్ర‌హ్మానంద‌రెడ్డి.. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, విఖ్యాత్‌రెడ్డి విష‌యానికి వ‌స్తే.. తానే నిజ‌మైన వార‌సుడిన‌ని.. భూమా నాగిరెడ్డి పేరు నిల‌బెట్టేందుకు తానే న‌డుంక‌డ‌తాన‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌లు చారిత్ర‌క అవ‌స‌ర మ‌ని అంటున్నారు. అప్ప‌ట్లో అంటే 2017లో అవ‌స‌రం కొద్దీ బ్ర‌హ్మానంద‌రెడ్డిని తీసుకున్నామ‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

ఇక‌, వీరిద్ద‌రూ నంద్యాల టికెట్ కోసం ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు భూమా మౌనిక కూడా చంద్ర‌బాబును క‌లుసుకోవ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ అంటూ.. ఆయ‌న‌తో చ‌ర్చించ‌డంవ‌ర‌కు రాజ‌కీయం సాగింద‌ని అంటున్నారు. దీంతో ఆమె కూడా నంద్యాల టికెట్ కోసం ఎదురు చూసే అవ‌కాశం లేక‌పోలేదు. అంటే.. మొత్తంగా ఒక్క సీటు కోసం.. భూమా కుటుంబం రాజ‌కీయంగా ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది.

పోనీ.. త‌మ్ముడు కోస‌మ‌ని మౌనిక త‌ప్పుకొన్నా.. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం త‌ప్పుకొనే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పిలిచి చెప్పినా.. వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ఒంట‌రి పోరుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పంథాలో సాగాల‌నిదాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే ఆయ‌న గెలుపు ఓట‌ములు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. ఓట్లు చీలిపోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి అవుతాడు. దీంతో ఇది ప‌రోక్షంగా భూమా కుటుంబానికి ఇబ్బందేనేని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ స‌మ‌స్య‌ను ఇప్పుడే ప‌రిష్క‌రించుకోవ‌డం మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.