సీఎం జగన్ పాలనలో రైతాంగం నిర్వీర్యమైందని, రైతుల కష్టాలు ఇబ్బందులు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ తన సొంత డబ్బులు ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెవత్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని మల్లపల్లిలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా మల్లపల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో పవన్ భేటీ అయ్యారు.
అక్కడ రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్…టీడీపీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016లో టీడీపీ హయాంలో ఇక్కడ పారిశ్రామిక వాడ కోసం భూ సేకరణ జరిగిందని, కానీ కొంతమందికే పరిహారం చెల్లించడంతో సమస్య మొదలైందని పవన్ విమర్శించారు. స్థానికులు కాదని, రైతులను కులాలవారీగా విభజించి ఒక కులం వారికి పరిహారం ఇచ్చారని ఆనాటి టీడీపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా పవన్ తప్పుబట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఒక కులం వారికే పరిహారం ఇస్తామని చెబుతోంది అని మండిపడ్డారు. రైతులను కులాల వారీగా విభజించడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మల్లపల్లిలో రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024 లో ప్రభుత్వం మారిపోతుందని, నిర్వాసితులకు తప్పక న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.
రైతులను కులాలవారీగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏ ఒక్క కులం వల్ల సమాజం నడవదని, రైతుల్లో అన్ని కులాల వారు ఉంటారని హితవు పలికారు. టీడీపీ కూడా మల్లపల్లి నిర్వాసితులకు అండగా ఉండాలని పవన్ కోరారు. అయితే, టీడీపీపై వైసీపీ వేసిన మాదిరిగా పవన్ కూడా పరోక్షంగా కుల ముద్ర వేయడం షాకింగ్ గా మారింది. మరి ఈ వ్యవహారంపై టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates