తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలకు ముందు దాదాపుగా ఇవే చిట్టి చివరి సమావేశాలు కావడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ అధికారం చేపడతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని గులాబీ బాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
2014లో కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, కానీ, తెలంగాణలో కనీసం 10 సీట్లు అయినా ఇవ్వకపోతే బాగోదని తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ ను రాంగ్ హ్యాండిల్ చేయడంతో ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. జగన్ ను రకరకాల వేధింపులకు గురిచేయడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడని, పులివెందుల ఉప ఎన్నికలో 4 లక్షల మెజారిటీతో గెలిచాడని అన్నారు. ఆ తర్వాత వరుస ఎన్నికలు స్వీప్ చేశారని, 2019 ఎన్నికలతో ఆంద్రాలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని 35వేల చెరువులు అదృశ్యమాయని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముందుగా చెరువులు బాగు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావులతో చర్చించామని కేసీఆర్ చెప్పారు. అందుకే, తెలంగాణ ఏర్పాటుకు ఆరు నెలల ముందు నుంచే మిషన్ భగీరథ పేరు పెట్టాలని ప్లాన్ చేసుకున్నామని.. మిషన్ కాకతీయ వల్ల 30 లక్షల బోర్లు నీళ్లు ఇస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఆ ప్రాజెక్టు నుంచే తుంగతుర్తి కోదాడ డోర్నకల్ తో పాటు పలు ప్రాంతాలకు నీళ్లు వెళ్తున్నాయని గుర్తు చేశారు.
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. గతంలో తెలంగాణను తుడిచివేసింది కాంగ్రెస్ అని, నెహ్రూ అని 1969 లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అణచివేత ధోరణితో వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఉద్యమాన్ని అణగదొక్కారని మండిపడ్డారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు గుప్పించారు.