ఇద్దరి టార్గెట్ ఒకటేనా ?

రాబోయే ఎన్నికల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాలుండబోతున్నాయి. అందులో సికింద్రాబాద్ ఒకటి. పైగా సికింద్రాబాద్ లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గంపై ఇద్దరు మహిళా ప్రముఖల కన్నుపడిందని సమాచారం. ఇందుకనే ఈ నియోజకవర్గం బాగా పాపులర్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల, రీసెంటుగా బీజేపీలో చేరిన సినీ సెలబ్రిటీ జయసుధ సికింద్రాబాద్ లో ప్రత్యర్ధులుగా తలపడే అవకాశాలున్నట్లు సమాచారం.

కొంతకాలంగా వైఎస్సార్టీపీ విషయమై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు కొద్దిరోజులుగా జోరు తగ్గింది కానీ మళ్ళీ జోరందుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ షర్మిల పార్టీ గనుక కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతే మొదటి ఆప్షన్ గా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ రెండో ఆప్షన్ గా సికింద్రాబాద్ ఎంపీ గా పోటీచేస్తారట. కాంగ్రెస్ లో విలీనమైతే పాలేరు ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

అందుకనే సికింద్రాబాద్ ఎంపీ స్ధానంపై ఎక్కువ దృష్టిపెట్టారట. ఇక జయసుధ విషయం తీసుకుంటే సికింద్రాబాద్ ఎంఎల్ఏ లేదా ఎంపీగా పోటీచేయచ్చని అంటున్నారు. సికింద్రాబాద్ ఎంఎల్ఏ టికెట్ కోసం ఇప్పటికే చాలామంది సీనియర్లు పోటీలు పడుతున్నారు. కాబట్టి అసెంబ్లీ టికెట్ సంగతి ఇప్పటికిప్పుడు తేలేట్లులేదు. ఇదే సమయంలో లోక్ సభకు పోటీచేసేట్లయితే పెద్దగా కాంపిటీషన్ లేదట. ఎందుకంటే ఇపుడు సిట్టింగ్ ఎంపీ హోదాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.

ఈయన వచ్చేఎన్నికల్లో అంబర్ పేట ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే కిషన్ ఎంఎల్ఏగా, జయసుధ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయంటున్నారు కమలనాదులు. అంటే కాంగ్రెస్ అభ్యర్ధిగా షర్మిల, బీజేపీ అభ్యర్ధిగా జయసుధ పోటీ దాదాపు ఖాయమయ్యేట్లుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఇద్దరు కూడా క్రిస్తియన్ మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టారు. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్తియన్ ఓట్లెక్కువ. సువార్త కూటములతో పాటు ఇతర ప్రార్ధనలు తదితర యాక్టివిటీస్ అన్నీ సికింద్రాబాద్ లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. మరి ఒకే వర్గం ఓట్లపై ఇద్దరు గురిపెట్టినపుడు అంతిమ విజయం ఎలాగుంటుందనేది ఆసక్తిగా మారింది.