ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతోనూ కలిసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ అంటున్నారు. టీడీపీ అధినేత బాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో బరిలో దిగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీసీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తోంది. కానీ టీడీపీతో కలిసే ఉద్దేశం లేదని జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ చెబుతోంది. మరోవైపు పవన్ సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.
ఒక్కసారి సీఎంను చేయడంటూ అడుగుతున్న పవన్.. బీజేపీ ప్రతిపాదనను కాదనకపోవచ్చు. అలా అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదనే చెప్పాలి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన, టీడీపీ పొత్తు కుదరదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు సొంతంగా తమ అభ్యర్థులను ప్రకటిస్తుండడమే అందుకు కారణం.
తాజాగా చిత్తూరులోని పూతలపట్టు నుంచి స్థానిక జర్నలిస్ట్ మురళీ మోహన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని బాబు ప్రకటించారు. అయితే 2009లో నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇక్కడ టీడీపీ గెలవనేలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీ నెగ్గింది. మరోవైపు తెనాలి నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో దిగుతారని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు పార్టీలు పొత్తుల గురించి స్పష్టత ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates