“దాదాపు 3.5 ఎకరాల్లో ఉండాల్సిన కొండ. కానీ.. ఇప్పుడు పావు ఎకరంలోపే ఉంది. దీని చుట్టూ తవ్వకాలు జరిగిపోయాయి. మట్టి, రాళ్లు వంటివి తరలించేశారు. అసలు.. మరో నెల రోజులు గడిస్తే.. ఇక్కడ ఒక కొండ ఉండేది-అని స్థానికులు చెప్పుకొనే పరిస్తితికి వచ్చేసింది. ఇదీ.. సైకో జగన్ పాలన “-అని టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న వినుకొండలో సాగుతోంది. ఇక్కడి ఈపూరు మండలం, పుచ్చకాయలబోడు గ్రామానికి సరిహద్దులో భారీ కొండ ఉంది. ఇది సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని స్థానికులు తెలిపారు. అయితే.. ఇప్పుడు అది కుంచించుకుపోయి.. మూడున్నర నుంచి పావు ఎకరంలోపునకు వచ్చింది. ఇదే విషయాన్ని ఈ మార్గంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్ గుర్తించి.. సెల్ఫీ తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “పెద్దనేత విశాఖలోని రుషి కొండనే కొట్టేయగా లేంది.. పిల్లనేతలు.. చిన్న చిన్న కొండలను అనకొండలుగా మింగేస్తున్నారు. ఇక్కడ కొండ ఇప్పుడు బోడి కొండ అయిపోయింది. దీనిని ఎవరు మింగేశారు? దీనికి బాధ్యులు ఎవరు?” అని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరులు మింగేయగా.. ఈ ముక్క మిగిలిందంటూ.. సెల్పీ తీసుకుని.. సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసిరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates