వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు అత్యవసరం. పార్టీని తిరిగి అధికారంలోకి తేకపోతే మనుగడ ఇక కష్టమే. ఈ విషయం బాబుకూ బాగా తెలుసు. అందుకే ఈ ఎన్నికలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా పుంగనూరు ఘటన బాబుకు కలిసొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదంటూ బాబు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో బహిరంగ సభకు వెళ్లే క్రమంలో మధ్యలో పుంగనూర్‌లో రోడ్‌షో నిర్వహించాలనుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే టీడీపీకి వ్యతిరేకంగా అక్కడే ఉదయం వైసీపీ శ్రేణులు మాత్రం ర్యాలీ చేపట్టారు. దీనికి పోలీసులు అనుమతిచ్చారు. దీంతో రగిలిపోయిన టీడీపీ కార్యకర్తలు.. ఏదైతే అది అయిందని ముందుకే సాగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వైసీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడం బాబులో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ద్వారా బాబుకు రెండు ప్రయోజనాలు కలిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసుల తీరును, ఆ పార్టీ కార్యకర్తల వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టేందుకు బాబుకు ఛాన్స్ దొరికింది. మరోవైపు దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గని కార్యకర్తల మనోబలాన్ని మరింత ప్రచారం చేస్తూ పార్టీలో కొత్త జోష్ నింపే ఆస్కారమూ కలగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.