మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిస్తేనే ద‌ళిత బంధా?

ద‌ళిత బంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డ‌మే లక్ష్యంగా కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మ‌ని దీన్ని అంటుంటారు. ఆ ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. ద‌ళితుల ఓట్ల కోసం 2021లో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ ప‌థ‌కం కింద ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ద‌ళిత బంధు కూడా ఊహించినంత వేగంగా సాగ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తొలి విడ‌త‌లో రాష్ట్రంలోని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి 11,900 మందికి ఈ ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండో విడ‌త‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 1100 మందిని ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఎంపిక చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. మొత్తం 1,29,800 మందికి ద‌ళిత బంధు అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 17 ల‌క్ష‌ల ద‌ళిత కుటుంబాలున్నాయి. వీళ్లంద‌రికీ ద‌ళిత బంధు అందిస్తామ‌ని కేసీఆర్ చెప్పారు.

కానీ రాష్ట్రంలోని ద‌ళిత కుటుంబాల‌న్నింటీకి ద‌ళిత బంధు ఇప్ప‌టికిప్పుడు ఇవ్వ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వం వల్ల అయ్యే ప‌ని కాదు. తాజాగా ఈ విష‌యాన్నే ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 17 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఒకేసారి ద‌ళిత బంధు ఇవ్వ‌లేమ‌ని చెప్పారు. మ‌రో ఏడేళ్ల‌లో అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో ఏడేళ్లు అంటే మ‌రో రెండు సార్లు ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌న్న‌మాట‌. అంటే మ‌రో రెండు సార్లు కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే.. ద‌ళిత బంధు అంద‌రికీ ద‌క్కుతుంద‌ని మంత్రి చెప్ప‌క‌నే చెప్పార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.