రాబోయే ఎన్నికల్లో దుష్టపాలకుడు (ఇది పవన్ మాట) జగన్మోహన్ రెడ్డి మీద సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ను గద్దె దింపాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్నారు. రాష్ట్రాన్ని జగన్ పాలన నుండి కాపాడుకోవాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్న విషయాన్ని గమనించాలన్నారు. ఒకవేళ పోరాటంలో విఫలమైతే మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని ఆందోళన వ్యక్తంచేశారు.
జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం గురించి అందరం మరచిపోవచ్చన్నారు. ఎంతో సుందరమైన నగరంగా పేరున్న విశాఖపట్నం ఇపుడు ఆర్గనైజ్డు క్రైంకు క్యాపిటల్ అయిపోయిందన్నారు. క్రైంలో తప్ప పలానా రంగంలో ఏపీ అగ్రభాగంలో ఉందని చెప్పుకునేందుకు లేదని పవన్ మండిపోయారు. వైసీపీని ఓడించేందుకు అందరితోను కలిసి పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పనిలో పనిగా భవిష్యత్ ఎన్నికల విషయాన్ని కూడా ప్రస్తావించారు.
రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 2019 మోడల్ అయితే అనుసరించేదిలేదన్నారు. రాబోయే ఎన్నికల కోసం ప్రత్యేక మోడల్ ను రెడీచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతం విషయంలో రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నామన్నారు. సర్వేల ఆధారంగానే పోటీ ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. సర్వేల్లో పార్టీ వెనకబడిన నియోజకవర్గాలు ఏవి, బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏవన్న విషయమై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. దీని ఆధారంగానే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇక అత్యంత వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్ధపైన కూడా పవన్ వ్యాఖ్యలు చేశారు. గడచిన రెండు సంవత్సరాలుగా వాలంటీర్లపై తనకు అందుతున్న సమాచారం ఆధారంగానే తాను కామెంట్ చేసినట్లు చెప్పారు. ఈ వ్యవస్ధపై రాబోయే బహిరంగసభలో మాట్లాడుతానన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ వైసీపీకి ప్రైవేటు సైన్యంగా మారిపోయిందని పవన్ ఆరోపించారు. అన్నీ విషయాలను తనతో పాటు జనాలందరు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి నేతలు క్షేత్రస్ధాయిలో కష్టపడి పనిచేయాలన్నారు. ముందస్తు ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతోందన్నారు. కాబట్టి నేతలు, క్యాడర్ అంతా సమిష్టిగా పోరాటం చేయాల్సిన బాధ్యతను గుర్తించి మెలగాలని పవన్ పదేపదే చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates