పవన్ పీఆర్వోలు.. పేర్ని, వెల్లంపల్లి, అంబటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాలను ఎంతమాత్రం ప్రమోట్ చేయడని అందరికీ తెలుసు. సినిమా మొదలైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. అప్‌డేట్స్ ఇవ్వడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. మీడియా వాళ్లకు వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. రిలీజ్‌కు ముందు తర్వాత ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం.. ఇలాంటివి పవన్ నుంచి ఆశించలేం. మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకదానికి వస్తాడు. అందులోనూ ఆ సినిమా గురించి కాకుండా వేరే విషయాలు మాట్లాడి వెళ్లిపోతుంటాడు.

ప్రమోషన్లు చాలా కీలకంగా మారిన ఈ రోజుల్లో పవన్ సినిమాలకు ఇది మైనస్సే అని భావిస్తుంటారు. కానీ పవన్ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ లోటు బాగానే భర్తీ అవుతోంది. పవన్ చేయాల్సిన పనిని వైసీపీ మంత్రులు తీసుకుంటుండటం గమనార్హం.

‘బ్రో’ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తిన వేసుకుని తిరిగేస్తున్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. వీకెండ్ తర్వాత చల్లబడ్డట్లు కనిపించిన ‘బ్రో’కు ఊపిరులూదింది ఒక రకంగా అంబటినే అని చెప్పాలి. ఆయన పెట్టిన ప్రెస్ మీట్.. ఈ సినిమా మీద ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఆయన వేసిన డిల్లీ టూర్ ప్లాన్ ‘బ్రో’ ప్రమోషన్లకు బాగా కలిసొచ్చింది. ఇలా పవన్ సినిమాలకు వైసీపీ పెద్ద నాయకులు పరోక్షంగా సపోర్ట్ చేయడం ఇది కొత్తేమీ కాదు.

‘వకీల్ సాబ్’ రిలీజైనపుడు పేర్ని నాని ఆ బాధ్యత తీసుకున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని.. పాత చింతకాయ పచ్చడి సినిమా అని విమర్శలు గుప్పిస్తూ.. దాని వసూళ్ల గురించి మాట్లాడారు మంత్రి నాని. ఆ తర్వాత ‘భీమ్లా నాయక్’ రిలీజైనపుడు మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డ్యూటీ ఎక్కారు. ఆయన కూడా అప్పటికి మంత్రే. ఆ సినిమా డిజాస్టర్ అని.. పవన్ తాను సంపాదించుకుని నిర్మాతలను ముంచేస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలా పవన్ సినిమా రిలీజైతే చాలు.. దాని మీద అక్కసు వెళ్లగక్కే క్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు తమ బాధ్యతలు పక్కన పెట్టి మరీ పరోక్షంగా ప్రమోషన్‌కు సహకరిస్తుండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లు పడుతున్నాయి.