జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ తనదేనంటూ అంబటి రాంబాబు గొడవ చేయడం, దానికి నిర్మాత విశ్వ ప్రసాద్, సాయి ధరమ్ తేజ్, పృథ్వీ రాజ్ లు క్లారిటీనివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమాను రాజకీయాల్లోకి తేవొద్దని జనసైనికులకు పవన్ విజ్ఞప్తి చేశారు. అభిమానులు రియాక్ట్ అయితే వేరని, కానీ,పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు సినిమా డిబేట్‌లోకి వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు.
డిబేట్ స్థాయి పెంచాలని, అవతలి వారి స్థాయికి దిగజారవద్దని కోరారు. వారు చెప్పిన దానికి సరైన సమాధానం చెప్పాలని, వివాదాల జోలికి పోవద్దని హితవు పలికారు. తన చుట్టూ తిరిగితే లీడర్లు కారని, కలిసిన వారినే మళ్లీ మళ్లీ కలవడం వల్ల తనకు సమయం వృథా అవుతోందని చెప్పారు. రాజకీయాల్లో తనకు సినిమానే ఇంధనమని, దానిని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నానని అన్నారు. ముందస్తు ఎన్నికలకు జనసేన కేడర్ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టడం, నడపడం అంత సులువు కాదని చెప్పారు. విలువలతో రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితిని వైసీపీ కల్పించిందని అన్నారు. గతంలోనూ ఈ ధోరణి ఉన్నా… వైసీపీ వచ్చాక విశ్వరూపం కనిపించిందని చెప్పారు.
రాజకీయం చేయాలంటే దోపిడీ, దౌర్జన్యం, పిచ్చిగా కారుకూతలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అన్న రీతిలో పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం తమ వెంట నడవాలంటే త్యాగం, బాధ్యత, జవాబుదారితనం ఉండాలని అన్నారు. సీట్ల కోసం ఏ రోజు ఎవరూ డబ్బులు తీసుకోకూడదన్నారు. ఓటర్లకు డబ్బులు ఇస్తే మాత్రం ఆ తప్పు మీదే అని అన్నారు. పవన్ తో మాట్లాడి పదవి ఇప్పిస్తాం అని డబ్బులు తీసుకుంటే.. అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు. అయితే, ఎన్నికల కసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఐడియాలజీ ఉన్నవారు ఇతర పార్టీలో ఉన్నా వారిని ఆహ్వానిస్తామన్నారు.
మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అన్నారు పవన్.