ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కులం తన కులం ఒకటే అయినందుకు సిగ్గుపడుతున్నానని పోసాని కృష్ణ మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులతో సీఎం జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నాడని విమర్శించారు. మీ బిడ్డగా మీ మంచి కోసం చెబుతున్నా చంద్రబాబుతో ఉంటే.. ఆయన మాట వింటే మీరు సర్వ నాశనమైపోతారని అమరావతి రైతులను హెచ్చరించారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయాక ఒకరోజు తుళ్లూరు మీదుగా జగన్ కారులో వెళుతుంటే రైతులతో బూతులు తిట్టించారని మండిపడ్డారు.జగన్ కారు వెళ్లిపోయాక నీళ్ల ట్యాంకర్ తెప్పించి, అందులో పసుపు కలిపి ఆ నీళ్లను రోడ్డుమీద చల్లించాడని గుర్తుచేశారు. ఈ సంస్కృతిని రైతు సోదరులు, రైతు సోదరీమణులు ఎక్కడ నేర్చుకున్నారంటూ పోసాని ప్రశ్నించారు.
చంద్రబాబు పరిపాలనలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న రైతుల పైకి కాల్పులు జరిపించారు.. ఇదే చంద్రబాబు కారులో వెళుతుంటే పసుపు నీళ్లు చల్లలేదేమని నిలదీశారు. ఆయన మన కులపు వాడని చల్లలేదా?.. మన కులపు వాడైతే ఏం చేసినా పర్వాలేదా.. జగన్ ఏం పాపం చేశాడని తిడుతున్నారని మండిపడ్డారు.
గతంలో ప్రజల సొమ్మును రాజకీయ నాయకులు పందుల్లాగా మింగేవారని, తొలిసారిగా ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి జగన్ ప్రజలకే పంచిపెడుతున్నారని చెప్పారు. ఆయన తినకుండా, మందిని తిననీయకుండా ప్రజలకే తినిపిస్తున్నాడని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే జగన్ కంటే మెరుగైన పాలన అందించారని నిరూపిస్తే.. ప్రజలతో చెప్పు దెబ్బలకు సిద్ధమని పోసాని సవాల్ విసిరారు.
అమరావతి రైతులు, పేదల ఉసురు తగిలి చంద్రబాబు జీవిత చరమాంకంలో కుళ్లికుళ్లి చస్తారంటూ పోసాని శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు చేసినవి, చేస్తున్నవీ అన్నీ మోసాలేనని ఆరోపించారు. జగన్ పైన కుళ్లుతో రైతులను ఎగదోసి బూతులు తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ చేస్తున్న మంచి పనుల వల్ల తనకు అధికారం దక్కదనే అక్కసుతో, తన కొడుకుకు భవిష్యత్తు ఉండదనే భయంతోనే చంద్రబాబు ఈ పనులు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయవేత్తగా కానీ, ఓ మనిషిగా కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.