సికింద్రాబాద్ బ‌రిలో ష‌ర్మిల‌.. కానీ ఆ పార్టీ నుంచి!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు దాడి పెంచిన ష‌ర్మిల కొంత‌కాలం నుంచి మౌనంగా ఉంటున్నారు. మ‌ధ్య‌లో నిరుద్యోగుల స‌మ‌స్య‌ల కోసం నిరాహార దీక్ష‌లు చేసిన ఆమె.. పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు. కానీ ఇప్పుడేమో ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఆమె వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అది కూడా త‌న సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి కాదు. కాంగ్రెస్ నుంచి. ఇక్క‌డ అదే ట్విస్టు.

సొంతంగా పార్టీ పెట్టినా, పాద‌యాత్ర చేసినా ష‌ర్మిల‌కు ప్ర‌జ‌ల్లో అనుకున్నంత గుర్తింపు రాలేక‌పోతోంది. పాద‌యాత్ర‌తో మైలేజీ రాలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఇదే విష‌య‌మై ష‌ర్మిల‌ను సంప్ర‌దించిన‌ట్టు టాక్‌. కానీ కాంగ్రెస్‌లో చేరేందుకు ష‌ర్మిల కొన్ని కండిష‌న్లు పెట్టిన‌ట్లు తెలిసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను పోటీ చేయించ‌డంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆమెను లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాల‌ని పార్టీ అధిష్ఠానం ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకు సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం స‌రైందిగా కాంగ్రెస్ భావిస్తుంద‌ని టాక్‌. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క్రిస్టియ‌న్ల ఓట్లు కీల‌క పాత్ర పోషిస్తాయి. అందుకే ఇక్క‌డ ష‌ర్మిల‌తో పోటీ చేయిస్తే గెలుస్తుంద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుంటోంద‌ని తెలిసింది. అలాగే ష‌ర్మిల పార్టీలో చేరితే ఇక్క‌డి వైఎస్ఆర్ అభిమానులు, ఏపీ సెటిల‌ర్లు, ఆమె సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల‌నూ త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ ఆఫ‌ర్‌కు ఒప్పుకుని ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందేమో చూడాలి.