ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడం కలవరపెడుతోంది. ఓ పక్క ప్రతి రోజు నిర్వహించే టెస్టుల సామర్ధ్యం పెంచిన ఏపీ సర్కార్…మరిన్ని టెస్టులు చేసేందుకు సిద్ధపడుతున్నామని చెబుతోంది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి లెక్కలకు పొంతన లేదని విమర్శలు వస్తున్నాయి. విమర్శలే కాదు…ఆ విమర్శలకు తగ్గట్లుగా గణాంకాలు కూడా గందరగోళంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం నాటికి ఏపీలో 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 21వ తేదీ ఒక్క రోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు వివరించారు. ఏప్రిల్ 23వ తేదీ నాటికి 48,032 పరీక్షలు నిర్వహించినట్లు డ్యాష్ బోర్డులో వెల్లడించారు. డ్యాష్ బోర్డు ప్రకారం ఒక్క రోజు వ్యవధిలో 6,520 పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఇక తాజాగా ఏప్రిల్ 24వ తేదీ నాటికి డ్యాష్ బోర్డులోని పరీక్షల సంఖ్య 54338. అంటే, ఒక రోజు వ్యవధిలో చేసిన పరీక్షల సంఖ్య 6,306.
అయితే, ఒక రోజు మొత్తంలో రాష్ట్రవ్యాప్తంగా 3,480 పరీక్షలు చేయగలుగుతున్నట్లు జవహర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. రోజుకి గరిష్టంగా పరీక్షించగల సామర్ధ్యం కేవలం 3,480 అయినప్పుడు నిన్న ఒక్కరోజే 6306 పరీక్షలు నిర్వహించడం ఎలా సాధ్యమన్న సందేహం కలుగక మానదు. పాజిటివ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లలో బోగస్ అంకెలున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు ఈ గణాంకాలు ఊతమిచ్చేలా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానూ, మరణాల పరంగా చూస్తే ఎక్కువగానూ ఉండడపై కూడా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.కరోనా బారిన పడి కోలుకున్న వారి పరంగా చూసినా అత్యంత తక్కువ శాతం మంది ఏపీలో ఉండడంపైనా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం…ఈ గణాంకాలపై ఫోకస్ పెట్టి…వాటికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, ఆ గణాంకాల్లో గందరగోళాన్ని తొలగించాల్సిన ఎంతైనా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates