సుమారు ఐదేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ విశాఖపట్నంకు మారింది. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులోనే కేసు విచారణ జరుగుతోంది. కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్నది అనుకుంటున్న సమయంలో సడెన్ గా కేసు విచారణ పరిధిని విజయవాడ నుండి వైజాగ్ కు ఎందుకు మారుస్తున్నారో అర్ధంకావటం లేదు. కేసు విచారణ నత్తనడకగా సాగుతోందనే అనుకోవాలి. ఎందుకంటే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి ఐదేళ్లు దాటినా ఇంతవరకు ఫైనల్ కాలేదంటే ఏమిటర్ధం.
నిందితుడు శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. విచారణ పూర్తి చేయకుండా, నిందితుడికి బెయిల్ ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు కేసు విచారణలోనే ఉండిపోతుంది ? కేసు విచారణను వెంటనే పూర్తిచేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి. లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ రెండు కూడా బాగా ఆలస్యమవుతుందని అనుకుంటే నిందితుడికి కనీసం బెయిలన్నా ఇవ్వాలి.
అంతేకానీ పై మూడింటిలో ఏదీ చేయకుండా విచారణ పేరుతో సంవత్సరాల తరబడి నెట్టుకొస్తామంటే కుదరదు. కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందా అని అందరు ఎదురుచూస్తున్న నేపధ్యంలో సడెన్ గా విచారణను వైజాగ్ కోర్టుకు బదిలీచేయటమే ఆశ్చర్యంగా ఉంది. రెడ్డొచ్చె మొదలెట్టే అనే సామెతలాగ కేసును వైజాగ్ ఎన్ఐఏ కోర్టు మొదటి నుండి విచారణ చేస్తుందా ? లేకపోతే ప్రస్తుత పరిస్ధితి నుండే విచారిస్తుందా అనే విషయంలో క్లారిటిలేదు.
కేసు విచారణకు జగన్ అయితే హాజరు కావడం లేదు. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సుంది. ఇదే సమయంలో కేసు విచారణ 80 శాతం పూర్తియిన దశలో విచారణ పరిదిని విజయవాడ నుండి వైజాగ్ ఎందుకు బదిలీ చేశారని నిందితుడి తరపు లాయర్లు అబ్దుల్ సలీం, గగనసింధు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి అన్యాయం జరుగుతుందని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణలో వ్యక్తిగత హాజరుకు జగన్ ఎందుకు మినహాయింపు కోరుతున్నారో తెలీటం లేదు. రెగ్యులర్ విచారణకు హాజరుకాకపోయినా కీలక విచారణకైనా హాజరు కాకపోవటంతోనే కేసు సంవత్సరాల తరబడి సాగుతోంది. మరి వైజాగ్ లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.