టీడీపీ అధినేత చంద్రబాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు.. మరోపేరుగా పార్టీ నాయకులు పేర్కొంటారు. అలాంటి చంద్రబాబు తాజాగా సంచలన హామీ ప్రకటించారు. ప్రస్తుతం సీమ డిక్లరేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం బాబుల నుంచి చంద్రబాబుకు ఊహించని ప్రశ్న వచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే.. మద్యం ధరలు తగ్గిస్తారా? అంటూ.. కొందరు మందు ప్రియులు ప్రశ్నించారు.
సాధారణంగా అయితే.. చంద్రబాబు బహిరంగ సభల్లో మద్యం గురించి ఎక్కడా ఎప్పుడూ.. కూడా ప్రకటనలు చేయలేదు. కానీ.. తాజాగా మద్యంపైనా ఆయన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.. మద్యం ధరలు తగ్గిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు.. నాణ్యమైన మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మద్యం ప్రియులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని.. తాము అధికారంలోకి రాగానే మద్యంపై ధరలు నియంత్రించడంతోపాటు.. ఒక క్రమబద్ధీకరణ విధానాన్ని కూడా ప్రకటిస్తామని తేల్చి చెప్పారు.
అయితే.. చంద్రబాబు ఇలా మద్యంపై బహిరంగ హామీలు గుప్పించడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. సంప్రదాయ ఓటర్లు కొంత పెదవి విరుస్తున్నారు. అదేంటి బాబూ.. మీరు కూడా.. అంటూ.. కొందరు వ్యాఖ్యానిస్తే.. ప్రస్తుతం మారిన రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు కూడా.. మారుతున్నారని మరికొందరు సమర్థిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు.. జగన్ మద్య నిషేధాన్ని విడతల వారీగా ప్రకటిస్తానని అధికారం చేపట్టారు. అయితే.. అలా చేయలేదు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. ఇటీవల పశ్చిమలో నిర్వహించిన 2.0 వారాహి యాత్రలో.. మద్యాన్ని నిషేధించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates