తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నుంచి రెండు సార్లు గెలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తన తనయుడు మోహిత్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మోహిత్ రెడ్డి ప్రచారాన్ని మొదలెట్టారు. చెవిరెడ్డి భార్య లక్ష్మీ, పెద్ద కొడుకు మోహిత్ రెడ్డి, చిన్న తనయుడు హర్షిత్ రెడ్డి జనం మధ్యలో ఉంటూ ఆశీస్సులు కోరుతున్నారు. కానీ భాస్కర్‌రెడ్డి మాత్రం కనిపించకపోవడం చర్చలకు దారితీసింది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రగిరిలో సందడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి మరోసారి పులివర్తి నాని పోటీపడబోతున్నారు. భార్య సుధారెడ్డితో కలిసి ఆయన ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. చంద్రగిరిలో ఇసుకరీచ్‌లపై టీడీపీ పోరాటం మొదలెట్టింది. మరోవైపు తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. అమ్మ, తమ్ముడితో కలిసి మోహిత్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
మోహిత్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నానని, ప్రజలు అండగా ఉండాలని ప్రకటించిన తర్వాత భాస్కర్‌రెడ్డి పెద్దగా జనాల్లో కనిపించడం లేదు. దీని వెనుక ఏదో ప్లాన్ దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాన్ని తన తనయుడికి వదిలేసి.. రాష్ట్ర స్థాయిలో జగన్‌కు సాయపడడం కోసం భాస్కర్‌రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థాయిని దాటి ఏదో పెద్ద అవకాశం కోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి స్థాయిలో ఉంటారన్నది మాత్రం ఎన్నికల తర్వాతే తేలుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates