ఎన్నికలకు మరో మూడు మాసాల గడువే ఉండడం.. అన్ని పార్టీలూ.. కూడా అధికారంపై కన్నేయడంతో తెలంగాణ అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అన్నివర్గాల వారినీ తనవైపు తిప్పుకొనేలా.. కోట్ల కు కోట్ల రూపాయల పథకాలను ప్రవేశ పెడుతున్నారు.అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం.. సహా.. అనేక సంచలన చర్యలకు నాంది పలుకుతున్నారు.
ఈ పరంపరలో తాజాగా కేసీఆర్.. తన కేబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్‌గా ఉన్న తెలంగాణ ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది పెద్ద సంచలన నిర్ణయమేనని చెప్పారు. ఇప్పటి వరకు వేలాది మంది(43,373) ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్నారు. ఇక, నుంచి వారంతా సర్కారీ ఉద్యోగులుగా మారనున్నారు. వారికి కూడా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని, ఇతర అలవెన్సులను అందించనున్నారు.
ఇదొక్కటే కాదు.. మరిన్ని నిర్ణయాలు కేసీఆర్ నోటి నుంచి అలవొకగా వచ్చాయి. అవి.. ఏంటంటే..
- మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరిస్తారు.
- రాయదుర్గం – విమానాశ్రయం వరకు మెట్రో రైలు, ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణ. మియాపుర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీ నగర్, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణ.
- జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం.
- జులై 18 నుంచి 28 వరకు కురిసిన వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన వారికి సాయం చేసేందుకు తక్షణం రూ.500 కోట్లు విడుదల.
- బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు
- రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి.
- అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్ పాలసీ
- గవర్నర్ కోటాలో మండలికి దాసోజు శ్రవణ్, సత్యనారాయణ
- హైదరాబాద్‌లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
- నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటు