టీడీపీ నాయకులు ఏ ఇద్దరుకలిసినా.. ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునా.. మజాకానా? అని వారు చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలకు సమయం చేరువ అయింది. మరో 8-9 మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే కసితో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే అనేక సందర్భాల్లో కూడా తమ్ముళ్లకు చెప్పేశారు.
ప్రభుత్వ.. ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కూడా చంద్రబాబు చెప్పారు. అదేసమయంలో తాను చేస్తున్న కార్యక్రమాలకు తోడు ఇస్తున్న పిలుపునకు అనుకూలంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే.. కొందరు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కొందరు మాత్రమే పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మరికొందరు మాత్రం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీంతో ఇలాంటి వారిని ఏరేయాలన్నది చంద్రబాబు నిర్ణయం.
అయితే.. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టుగా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా నాయకుల గ్రాఫ్‌పై ఆయన సర్వేలు చేయిస్తున్నా రు. ఐటీడీపీ ఇస్తున్న సర్వేలకు తోడు క్షేత్రస్థాయిలో నాయకుల వ్యక్తిగత రాజకీయాలు.. వైసీపీతో చెలిమి చేస్తూ.. మీడియా ముందు.. టీడీపీ అనుకూల ప్రకటనలు చేస్తున్నవారు.. ఇలా అనేక మంది ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నవారిని కూడా చంద్రబాబు మరో కంట కనిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఐటీడీపీ సర్వేతో పాటు.. మరో సర్వే కూడా చేయిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీల్లో పనిచేసినవారితో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఇక్కడే మరో లోపాయికారీ వ్యవహారం కొన్నాళ్ల కిందట వెలుగు చూసింది. సర్వే చేస్తున్నవారిని కూడా నాయకులు ప్రలోభాలకు గురిచేసి.. తమకు అనుకూలంగా సర్వేలు వచ్చేలా చేస్తున్నారు. దీనిపై వార్తలు రావడంతో అలెర్ట్ అయిన చంద్రబాబు ఎవరికీ తెలియకుండా అత్యంతగోప్యంగా మరో సర్వే చేయిస్తున్నారు. మొత్తంగా మూడు రకాలుగా వడపోత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తమ్ముళ్లుచెబుతున్నారు. అయితే.. ఎవరు సర్వే చేస్తున్నారో తెలియనంతగా ఇవి సాగుతుండడం గమనార్హం. దీంతో చంద్రబాబు నిర్ణయంపై తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు.