వైసీపీ న‌వ‌ర‌త్నాలకు.. బీజేపీ న‌వ ప్ర‌శ్న‌లు..

ఏపీ వైసీపీ సర్కారు అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల‌కు మంచి డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డికెళ్లినా.. సీఎం జ‌గ‌న్, మంత్రులు, పార్టీ నాయ‌కులు ఈ న‌వ‌ర‌త్నాల గురించే చెబుతుంటారు. ఇప్పుడు ఇలానే.. 9 ప్ర‌శ్న‌ల‌తో బీజేపీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. చార్జిషీట్ పేరుతో బీజేపీ ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు 9 ప్ర‌శ్న‌లు సంధించింది.వీటికి స‌మాధానం చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసింది. స‌మాధానం చెప్ప‌క‌పోతే.. వాటిని ఒప్పుకొన్న‌ట్టేన‌ని ష‌ర‌తు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బీజేపీ నాయ‌కుడు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి మండిపడ్డారు. ఆమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో? ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలంటూ 9 ప్ర‌శ్న‌లు వేశారు.

మ‌రి ఆ 9 ప్ర‌శ్న‌లు ఏంటంటే..

1) చిన్నారుల‌ అక్రమ రవాణాలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉంది. దీనికి కార‌ణ‌మేంటి?
2) తలసరి ఆదాయంలో తెలంగాణ కంటే వెనుక‌బ‌డింది. దీనిని బాధ్యులు ఎవ‌రు?
3) కేంద్రం ఇస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌ పథకానికి అయ్యే ఖర్చులో నిధుల‌ను ఏం చేశారు?
4) కేంద్రం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించ‌లేదు.
5) పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు?
6) 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించడం లేదు?
7) ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎందుకు దూరం చేశారు?
8) ఖాళీగా ఉన్న 2.50 లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?
9) రోడ్ల‌ను ఎందుకు పునర్నిర్మించడం లేదు? వైసీపీ మంత్రులు కారు యాత్రలు చేస్తారా?