ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ వ్యూహాలు, ప్రణాళికలు, కసరత్తులపై దృష్టి సారించాయి. తమకు పట్టున్న నియోజకవర్గాలు, గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల అధినేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని భీమిలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని జనసేన చూస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే స్థానంపై దృష్టి పెట్టారని తెలిసింది.
2019 ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస రావు విజయం సాధించారు. అప్పుడు రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి (91917 ఓట్లు) నిలిచారు. మూడో స్థానాన్ని జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్ (24248) దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు జనసేన చూస్తోంది. గత ఎన్నికల్లో 24 వేలకు పైగా సీట్లు సాధించడంతో ఈ సారి తమదే గెలుపు అంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ పంచకర్ల సందీప్ ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారాన్ని ఈ నెల 30తో ప్రారంభించాలని నిర్ణయించారు.
మరోవైపు ఇక్కడి నుంచి తెలుగు దేశం పార్టీ తరపున ఓ మాజీ మంత్రితో పాటు కీలక నేతలూ పోటీకి సిద్ధంగా ఉన్నారు. జనసేన కూడా తగ్గేదే లేదు అంటోంది. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా భీమిలిలో మాత్రం పోటీ చేసేందుకు జనసేన పట్టుదలతో ఉంది. భీమిలీలో జనసేన జెండా ఎగరేలని పార్టీ సమీక్షలో అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఇది బాబుకు తలనొప్పి తెచ్చి పెట్టే విషయంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates