మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు.. ఉండవల్లి అరుణ్ కుమార్.. వైసీపీ ఎంపీలపై షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని.. కానీ, దీనిని 36 మంది వైసీపీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేంద్రానికి వైసీపీ ఎంపీలు భయపడుతున్నారా? ఇలా చేస్తుంటే.. వారు భయపడుతున్నారనే అనుకుంటాం అని ఉండవల్లి అన్నారు.
ఎవరికి ఎన్ని సొంత పనులు ఉన్నా.. కేంద్రంలో ఇప్పుడు వచ్చిన అవకాశం భవిష్యత్తులో రాదని చెప్పారు. ఇప్పుడు అవిశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని మరోసారి పార్లమెంటు వేదికగా చర్చించేందుకు వాడుకోవాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన పై తీర్మానం చేసి పదేళ్ళు పూర్తయిందని చెప్పారు. అయితే.. ఇన్నేళ్లలోనూ విభజన హామీలు అమలుకావటం లేదని విమర్శించారు.
ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో మోడీకి సహకరిస్తున్నారనేందుకు తన దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయ ని ఉండవల్లి చెప్పారు. ఎన్నికల ముందైనా ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో మాట్లాడాలని సూచించారు. మణిపూర్ సంఘటనపై 267, 176 రూల్స్ ప్రకారం పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వాలని ఉండవల్లి చెప్పారు.
ఇది జగన్‌కే మంచిది కాదు!
ప్రధాని మోడీకి అన్ని విషయాల్లోనూ లోబడి ఉండడం ముఖ్యమంత్రి జగన్‌కు మంచిది కాదని ఉండవల్లి హెచ్చరించారు. గుజరాత్‌లో ముస్లింల ఊచకోత వల్లే మోడీ ప్రధాని అయ్యారని సంచలన విమర్శ చేశారు. వలంటీర్ల వ్యవస్థపై కోర్టుకి వెళితే ఆ వ్యవస్థ రద్దవుతుందని, టీడీపీ, జనసేన పార్టీలు కోర్టుకి ఎందుకు వెళ్లటం లేదని ఉండవల్లి నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates