రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీలో మొదటి జాబితా రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా పండుగ తర్వాత జాబితా ప్రకటన ఉంటుందని నేతలు అంటున్నారు. మొదటి జాబితాను 72 మందితో జగన్ రెడీచేశారట. ఇందులో 50 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు, మిగిలిన 22 మంది కొత్తముఖాలట. ఏ ఏ నియోజకవర్గాలతో మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం తెలియకపోయినా మొత్తం మీద సంఖ్య, పాత, కొత్త ముఖాలతో రెడీ అయ్యిందనే విషయం పార్టీలో ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది.
దాదాపు ఏడాదిన్నరగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్దితిపైనే కాకుండా సిట్టింగు ఎంఎల్ఏల పరిస్థితిపై జగన్ అనేక రకాలుగా సర్వేలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్నే జగన్ దాదాపు ఏడాదిపాటు నిర్వహించారు. దీంట్లో మంత్రులు, ఎంఎల్ఏలందరినీ జనాల్లోనే ఉండేట్లుగా జగన్ చేయగలిగారు. ఆ సమయంలో ఎంఎల్ఏలు ఇళ్ళకి వెళ్ళినపుడు జనాల రియాక్షన్ ఎలాగుందనే విషయాన్ని కూడా పరిశీలించారు.
ఇలాంటి అనేక మార్గాల్లో జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగానే 72 మందితో మొదటి జాబితా రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో వివాదాలు లేని నియోజకవర్గాల్లో సిట్టింగులే ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇన్చార్జిలుగా నేతలు కష్టపడుతున్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయట. కాబట్టే సిట్టింగులు+కొత్త నియోజకవర్గాలన్న పద్ధతిలో 72 మందితో మొదటి జాబితా రెడీ అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడీ అయిన జాబితాను కూడా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని దసరా పండుగ నాటికి ఫైనల్ చేయాలని జగన్ అనుకున్నారట.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలన్నది జగన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల అభ్యర్థులకు రెండు లాభాలున్నాయట. అవేమిటంట మొదటిది ప్రచారం చేసుకోవటానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. రెండోది అసంతృప్తలను దారికి తెచ్చుకునేంత టైం ఉంటుంది. గడపగడపకు వైసీపీపై జగన్ ఈ మధ్యనే నిర్వహించిన వర్క్ షాపులో సుమారు 18 మంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. వారిలో చాలామందికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కేది అనుమానమే అంటున్నారు. మరి దసరా పండుగ సందర్భంగా రిలీజయ్యే జాబితాపై నేతలు రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates