రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రెడి అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇపుడు రెడీ అయ్యింది మొదటి జాబితా మాత్రమేనట. అంటే మొత్తం 119 నియోజకవర్గాలను కేసీయార్ మూడు విడతలుగా ప్రకటించబోతున్నారట. మొదటి విడత జాబితాలో ఎలాంటి వివాదాలు లేకుండా, ఇతరులనుండి పోటీలేని సిట్టింగ్ ఎంఎల్ఏల జాబితా ఉంటుందని సమాచారం. ఇక రెండో జాబితాలో టికెట్ కోసం నేతల మధ్య కొద్దిపాటి పోటీ ఉండే నియోజకవర్గాలుంటాయట.
అంటే ఇలాంటి నియోజకవర్గాల్లో నేతలను పిలిపించుకుని అందరితో మాట్లాడి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయనే విషయమై సర్వేల ఆధారంగా కేసీయార్ డిసైడ్ చేస్తారు. అలాంటి నియోజకవర్గాల్లోని నేతలను పిలిపించుకుని సర్దుబాటు చేసి అభ్యర్ధులను ఫైనల్ చేస్తారు. ఇలాంటి నియోజకవర్గాలు రెండో జాబితా పరిధిలోకి వస్తుంది. ఇక మూడో జాబితా ఏమిటంటే జనాల్లో బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల నియోజకవర్గాలున్నాయి.
భూకబ్జాలు, అవినీతి లాంటి పెద్ద మైనసులున్న నియోజకవర్గాలు సుమారుగా 30 వరకు ఉన్నట్లు కేసీయార్ చేయించుకుంటున్న సర్వేల్లో బయటపడిందట. ఇక్కడ సిట్టింగులను మారిస్తే ఎవరిని ఎంపికచేయాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే సిట్టింగులకు టికెట్లు లేదంటే వాళ్ళేమి చేస్తారో ? అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. టికెట్ దక్కని సిట్టింగులు పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పనిచేసి ఇబ్బంది పెడతారా ? లేకపోతే తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీచేసి బీఆర్ఎస్ విజయాన్ని దెబ్బకొడతారా అన్నదే తెలియటంలేదు. అదీ ఇది కాకపోతే బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి వెళ్ళి వ్యతిరేకంగా పనిచేస్తారా అన్న సందేహాలతో కేసీయార్ కు దిక్కుతోచటంలేదట.
ఏదేమైనా 30 నియోజకవర్గాల్లో పార్టీకి ఎక్కువగా మైనస్ జరిగే అవకాశాలున్నాయన్నది అర్ధమవుతోంది. మొత్తం నియోజకవర్గాలను బావ, బావమరుదులు అంటే మంత్రులు కేటీయార్, హరీష్ రావు జాబితాలను పట్టుకుని కుస్తీలు పడుతున్నారట. మొదటి జాబితాలో ప్రకటించాల్సిన నియోజకవర్గాలేవి, రెండో జాబితాలో ప్రకటించాల్సిన అభ్యర్ధులు ఎవరనే విషయంలో మంత్రులు ఇద్దరు చాలా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడో జాబితాపై ఒకటికి రెండుసార్లు పరిశీలనలు, చెకింగ్, క్రాస్ చెకింగులు చేస్తున్నట్లు సమాచారం. ఆగష్టు మొదటి వారంలో మొదటి లిస్టు ప్రకటన ఉంటుందని అంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates