కేటీఆర్‌, హ‌రీష్‌రావు మెజారిటీ త‌గ్గ‌నుందా?

కేటీఆర్‌, హ‌రీష్‌రావు.. బీఆర్ఎస్‌లో తిరుగులేని నాయ‌కులు. కేసీఆర్ త‌న‌యుడిగా కేటీఆర్‌, మేన‌ల్లుడిగా హ‌రీష్ రావు రాజ‌కీయాల్లో అడుగుపెట్టినా.. ఆ త‌ర్వాత త‌మ‌కంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో కీల‌క నేత‌లుగా ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భుత్వంలోనూ మంత్రులుగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కానీ ప్ర‌భుత్వంలో కానీ ఈ ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నార‌డంలో సందేహం లేదు. ఇక ఇలాంటి స్థాయిలో ఉన్న ఈ ఇద్ద‌రు లీడ‌ర్లు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ వీళ్ల మెజారిటీ త‌గ్గుతుంద‌ని ఓ స‌ర్వేలో తేల‌డం మాత్రం ఊహించ‌ని విష‌య‌మే.

వ‌రుస‌గా మూడో సారి ఎన్నిక‌ల్లో జయ‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని చూస్తున్న కేసీఆర్‌.. ఇప్ప‌టికే అనేక అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ స‌ర్వే ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేటీఆర్, హ‌రీష్ రావు మెజారిటీ త‌గ్గుతుంద‌ని తేలింద‌ని స‌మాచారం. రాజకీయ జీవితంలో ఇప్ప‌టివ‌ర‌కూ వీళ్లిద్ద‌రూ ఓట‌మి చూడ‌లేదు. 2004 నుంచి ఉప ఎన్నిక‌లు కూడా క‌లిపి సిద్ధిపేట నుంచి హ‌రీష్ వ‌రుస‌గా ఆరు సార్లు గెలిచారు. 2008 నుంచి సిరిసిల్లా నుంచి కేటీఆర్ అయిదు సార్లు నెగ్గారు.

2018 ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో అత్య‌ధిక మెజారిటీ సాధించిన నాయ‌కుడిగా రాష్ట్రంలో అగ్ర‌స్థానంలో నిలిచారు. 88,886 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ మూడో స్థానం ద‌క్కించుకున్నారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌రిస్థితులు ఇలా ఉండ‌వ‌ని ఆ స‌ర్వే తేల్చింది. వీళ్ల విజ‌యం విష‌యంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్య‌తిరేక‌త‌, మ‌రోవైపు కాంగ్రెస్‌, బీజేపీ లాంటి ప్ర‌త్య‌ర్థి పార్టీలు పుంజుకోవ‌డం వీళ్ల మెజారిటీపై ప్ర‌భావం చూపుతుందంటున్నారు. మ‌రి అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే ఎన్నిక‌లు ముగిసేంత‌వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.