చంద్రబాబు నాయుడు మరో ప్రోగ్రామ్ కు రెడీ అవుతున్నారా ? అవుననే చెబుతున్నారు తమ్ముళ్ళు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ చేస్తున్నారట. వాతావరణం సహకరిస్తే ఆగస్టు 1,2 తేదీల్లో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని అనుకుంటున్నారట. తర్వాత కడప జిల్లా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇపుడు కురుస్తున్న భారీ వర్షాలు తగ్గిపోతాయనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. వర్షాలు తగ్గిపోగానే ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ చేస్తున్నారు.
రెండురోజులుగా పార్టీ ఆఫీసులో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్ధితులపై చంద్రబాబు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తమ హయాంలో ప్రాజెక్టులకు విడుదలచేసిన నిధులు, జరిగిన పనులు, బ్యాలెన్స్ ఉండిపోయిన పనులు తదితరాలను వివరిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులను ఏ విధంగా నిర్లక్ష్యంచేసిదనే విషయమై ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.
ప్రాజెక్టులను పూర్తిచేయటానికి విడుదలచేసిన నిధులు, చేస్తున్న పనులు తదితరాలను అంకెలతో సహా మీడియాకు వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాదాన్యతలను అంకెలతో సహా వివరించారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఉదాహరణలతో ఎండగట్టారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను జగ్న ప్రభుత్వం ఏ స్ధాయిలో దెబ్బకొట్టిందో ఉదాహరణలతో వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ జీవనాడిగా చంద్రబాబు అభివర్ణించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపోయారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అంతిమ ఫలితాలను ప్రజలకు వివరించేందుకే తాను ప్రాజెక్టుల సందర్శన ప్రోగ్రామ్ ను పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టులను సందర్శించటం ద్వారా ప్రాజలకు అన్నీ విషయాలను వివరిస్తానన్నారు. ప్రాజెక్టుల పరిస్ధితులపైన అన్ని వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.