వైసీపీ ముఖ్యనాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించనున్నారా? ఆయనకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందా? అంటే.. ఔననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. వచ్చే ఎన్నికలకు ముందుగానే రాజ్యసభ సీట్లకు మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 24, 2024లో మూడు రాజ్యసభ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక వైవీకి రిజర్వ్ చేశారనేది తాడేపల్లి వర్గాల టాక్.
ఖాళీ అవుతున్న స్థానాల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(వైసీపీ), సీఎం రమేష్(బీజేపీ), కనకమేడల రవీంద్ర కుమార్(టీడీపీ)లు ఉన్నారు. నిజానికి వీరి సీట్లు ఖాళీ అయ్యే సమయానికి రాష్ట్రంలో ఎన్నికల ఫలితం రాదు. సో.. అప్పటి వరకు ఉన్న అసెంబ్లీ బలాబలాను బట్టి.. ఈ సీట్లను కేటాయిస్తారు. దీంతో ఈ మూడు కూడా వైసీపీకే దక్కనున్నాయి. ఈ క్రమంలో ఒక సీటును వైవీకి కేటాయించే అవకాశం ఉందని పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.
నిజానికి వైవీ కూడా పార్లమెంటుకు వెళ్లాలనే భావిస్తున్నారు. ఎంపీ స్థానాలు ఎలానూ ఖాళీగా లేకపోవడం.. పైగా ఖర్చుతో కూడుకున్నవి కూడా కావడంతో ఆయన ఈ దశలో రాజ్యసభ సీటుకే మొగ్గు చూపుతున్నారు. దీనిపై కొన్ని రోజులుగా సీఎం జగన్‌తోనూ ఆయన చర్చిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీని ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పి.. వచ్చే ఐదారు మాసాలు పార్టీకి వాడుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని పార్టీ అధినేత లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే వైవీ కూడా .. తన మనసులోని కోరికను వెల్లడించారని.. దీనిపై పక్కా హామీ కూడా ఇచ్చారని.. ఎన్నికలకు ముందు రాజ్యసభకు వైవీ వెళ్లడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఆయనకు పార్టీలో మరిన్ని బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates