శనివారం … జనసేన బిగ్ ప్లానింగ్ !

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో షార్ట్ పీరియడ్ వార్ కు తెరలేపారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చారు. కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి ప్రభుత్వం జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది.

ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే ఇపుడు కురుస్తున్న భారీవర్షాలకు ఆ కాలనీలన్నీ జలమయమైపోయాయి. ఇళ్ళ నిర్మాణాల కోసం వేసిన పునాదులు, పిల్లర్లు ఎక్కడో కూడా గుర్తుపట్టేందుకు లేనంతగా నీళ్ళు నిండిపోయాయి. దాంతో జనసేన అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నది. అందుకనే సదరు కాలనీలను సందర్శించి ఫొటోలు, వీడియోలు తీసి పార్టీ ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో పోస్టుచేయాలని పవన్ పిలుపిచ్చారు. దీనివల్ల జగనన్న కాలనీల అసలు వాస్తవాలు మిగిలిన జనాలకు కనబడుతుందని పవన్ అబిప్రాయపడ్డారు.

నేతలు, కార్యకర్తలంతా తమ నియోజకవర్గాలు, ఊర్లలో పది గంటలపాటు శనివారం వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే పనిలోనే ఉండాలని పవన్ ఆదేశించారు. దీనివల్ల ఏమవుతుందంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఆ నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాలేవి, వాటి ప్రస్తుత పరిస్థితి కూడా జనాలకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సోషల్ మాడియా వార్ వల్ల జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం దొరుకుతుందని పవన్ అభిప్రాయం.

ఇలాంటి సోషల్ మీడియా వార్ నే గతంలో కూడా జనసేన టేకప్ చేసింది. అప్పట్లో కూడా జగనన్న కాలనీలని ఒకసారి, రోడ్ల పరిస్ధితి అని మరోసారి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతరేకంగా బాగా పోరాడింది. జగనన్న కాలనీల్లో వీడియోలు, ఫొటోలు తీసేక్రమంలో కొన్నిచోట్ల గొడవలైనా మొత్తంమీద పోరాటం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మళ్ళీ ఇంతకాలానికి పవన్ సోషల్ మీడియా వార్ కు సిద్ధమయ్యారు. మరి తాజా వార్ లో ఎలాంటి పరిస్ధితులు కనబడుతాయో చూడాల్సిందే.