టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు విమ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాలంటూ.. ఎమ్మెల్యే బొల్లా స‌వాల్ విసిరారు. మ‌రోవైపు మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఈ రోజు(గురువారం) ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీని చేపట్టాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.

ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అదేస‌మ‌యంలో కారులో అక్క‌డికి చేరుకున్నారు. దీంతో కొంద‌రు ఆందోళ‌న‌కారులు ఆయ‌న‌ కారుపై రాళ్లు రువ్వారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో ప‌లువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ సాంబ‌శివ‌రావు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదిలావుంటే జిల్లా అధికారులు వినుకొండలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు.