పవన్ పెళ్లిళ్ల గురించి నీకెందుకు జగన్?:నారాయణ

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, అదే స్థాయిలో పవన్ పై కూడా జగన్, వైసీపీ నేతలు ప్రతివిమర్శలు కూడా చేస్తున్నారు. కానీ, రెండు రకాల విమర్శలు ఒకటి కాదు. పవన్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు దుయ్యబట్టారు. తన పెళ్లిళ్ల గురించి జగన్ కు ఎందుకని, తాను ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని బహిరంగ సభలలో కూడా పలుమార్లు పవన్ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు.

అయినా సరే తీరు మారని జగన్ మాత్రం వైసీపీ నేతలతో కలిసి పవన్ 3 పెళ్లిళ్లు అంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలో పవన్ కు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. పవన్ కు మద్దతుగా మాట్లాడిన నారాయణ….జగన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ మూడు పెళ్లిళ్ల గురించే జగన్ ప్రతిసారీ మాట్లాడుతున్నారని నారాయణ తప్పుబట్టారు. పవన్ విడాకులు తీసుకొని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని నారాయణ ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా? లేదంటే బాబాయిని హత్య చేయడం తప్పా? అని నారాయణ ప్రశ్నించారు.

బాబాయ్ ని చంపడం తప్పు కాదని జగన్ చెబుతారా అని నిలదీశారు. సీఎం స్థాయిని మరిచి జగన్ దిగజారి మాట్లాడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చని, కానీ తరచుగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేనందునే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు జగన్, వైసీపీ నేతలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, నారాయణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.