పార్లమెంటులో ఈ రోజు జరిగిన పరిణామాలు మరోసారి వైసీపీ-మోడీ మధ్య బంధాన్ని స్పష్టం చేశాయి. తాజాగా పార్లమెంటులో మోడీ సర్కారుపై ప్రతిపక్ష కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే.. మోడీ సర్కారుపై విశ్వాసం లేదంటూ.. కాంగ్రెస్ సభ్యుడు గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. దీనిని దాదాపు ఇండియా
లోని అన్ని పక్షాలు సమర్థించాయి.
అయితే.. ఇండియాలోనే ఉన్నా.. కొన్ని పక్షాలు మాత్రం దూరంగా ఉన్నాయి. దీనిపై చర్చ చేపట్టాక మద్దతిస్తామని ప్రకటించాయి. ఈ తీర్మానం తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా.. దీనిపై అన్ని పార్టీల సభ్యులతోనూ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని..తర్వాత చర్చ చేపడతామని చెప్పారు. దీంతో సభలో ఒకింత శాంతియుత వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ.. మణిపూర్ వేడి అయితే తగ్గలేదు.
ఇదిలావుంటే.. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదీ ఏమీలేదు. అయినా.. సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారు. సజావుగా సాగుతున్న సభలో ఈ అవిశ్వాసం ఎందుకు? దీనివల్ల ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసినట్టు అవుతుంది. దీనికి వైసీపీ దూరంగా ఉంటుంది. మేం మద్దతు ఇవ్వం” అని వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా వైసీపీ మోడీకే మద్దతు ఇచ్చిందా! అని విపక్షాలు చర్చించుకున్నాయి.