కేసీఆర్ స‌ర్కారుపై బాబు ప్రేమ‌.. ఇక టీ టీడీపీ ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాల‌ని చూస్తున్న టీడీపీ అధినేత‌.. అధికార వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌ను ప‌దునెక్కించారు. రైతుల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని వైసీపీ ప్ర‌భుత్వం అంటూ బాబు ధ్వ‌జ‌మెత్తారు. కానీ ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో రైతులు సంతోషంగా ఉన్నారంటూ.. ఇక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పొగుడుతూ వ్యాఖ్యానించ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ అధినేతే.. కేసీఆర్‌కు సానుకూలంగా మాట్లాడితే ఇక తెలంగాణ‌లో టీడీపీ ఉండ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ స‌ర్కారుకు రైతుల‌పై ప్రేమ ఉంద‌ని, అందుకే మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెట్ట‌నివ్వ‌లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, రైతుల‌పై ప్రేమ‌, గౌర‌వం ఉన్న ప్ర‌భుత్వ‌మే అలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని బాబు చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింద‌ని కూడా అన్నారు. అందుకే అక్క‌డ భూములు విలువ పెరిగింద‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు ప‌క్క రాష్ట్రం తెలంగాణ స‌ర్కారును పొగుడుతూ బాబు వ్యాఖ్య‌లు చేయ‌డం బాగానే ఉంది. కానీ తెలంగాణ‌లోనూ టీడీపీ ఉంద‌ని ఆయ‌న మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ దారుణ ఫ‌లితాల‌తో తెలంగాణ‌లో టీడీపీ ప‌త్తాలేకుండా పోయింద‌నే అభిప్రాయాలున్నాయి. కానీ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కాసాని జ్ణానేశ్వ‌ర్‌.. తెలంగాణ‌లో టీడీపీ ఉనికిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా మ‌రో అయిదుగురి చేరిక‌తో రాష్ట్ర క‌మిటీని బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్నారు. కానీ అధినేత బాబు తాజా వ్యాఖ్య‌లు టీ టీడీపీకి మింగుడుప‌డ‌డం లేదు. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని బాబు పొగుడుతుంటే.. తాము ఆ పార్టీపై ఎలా పోరాడ‌గ‌ల‌మ‌ని టీ టీడీపీ శ్రేణులు అంటున్నాయి.