ఏపీ ఎమ్మెల్సీ కోడలి కారు.. జూబ్లీహిల్స్ లో రెండు ప్రాణాల్ని తీసింది

ఎక్కడ ఏపీలోని కర్నూలు జిల్లా? ఎక్కడ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్. ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేదు. కానీ.. అక్కడి కారు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చేసిన రచ్చకు రెండు నిండు ప్రాణాలు పోయిన ఉదంతం శనివారం తెల్లవారుజామున జరిగింది. గంటల పాటు గుట్టుగా ఉంచిన ఈ ఉదంతం మీడియా పుణ్యమా అని బయటకు వచ్చింది.

అతి వేగం.. అంతకు మించిన నిర్లక్ష్యం.. రెండు ప్రాణాలు పోయేందుకు కారణమైతే.. సదరు కారు ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ కోడలి పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం అర్థరాత్రి వేళలో జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబరు 92 సమీప కాలనీల్లో విద్యుత్ సరఫరా ఆగింది. అప్పటికే భారీ వర్షం పుడుతున్న వేళ.. ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖుల ఇళ్ల నుంచి.. బంజారాహిల్స్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి.

దీంతో ఉన్నతాధికారి ఆదేశాలతో కిందిస్థాయి ఉద్యోగులు కరెంటు పోయిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చిమ్మ చీకటిగా ఉండటంతో విద్యుత్ ఉద్యోగులకు సాయం చేసేందుకు అక్కడి అపార్ట్ మెంట్ వాచ్ మన్ నగేశ్ టార్చిలైట్ తో సాయానికి వచ్చాడు. వారంతా పనిలో మునిగి ఉన్న వేళ.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 నుంచి జూబ్లీహిల్స్ వైపుకు దూసుకెళుతున్న కారు (ఏపీ39 సీవీ9999) ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. కళ్లు మూసి తెరిచేంతలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే నిలిపి ఉంచిన మరో వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ఉదంతలో వాచ్ మెన్ తో పాటు.. విద్యుత్ సంస్థ ఉద్యోగి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ఏపీలోని కర్నూలు ఎమ్మెల్సీ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. ఈ కారు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కోడలు లక్ష్మీకుమారి పేరు మీద ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇటీవల సదరు ఎమ్మెల్సీ జూబ్లీహిల్స్ లోని కొత్త ఇంట్లో గృహప్రవేశం జరిగింది. ఈ పని మీద వచ్చిన కారు డ్రైవర్.. అతడి సోదరుడు మద్యం తాగి కారునడపటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. కొత్త ఇంట్లో పడుకునేందుకు వెళుతున్న వారు.. అతి వేగంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.