సీబీఐకి ఇంగిత జ్ఞానం లేదు: సజ్జల

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ సునీత ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ నేతలే వివేకా హత్యకు పాల్పడ్డారని మీడియాకు చెప్పాలంటూ సజ్జల తనకు సూచించారని సునీత చెప్పిన వైనం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే సునీత వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

సునీత ఇంటికి భారతితో కలిసి తాను వెళ్ళలేదనీ, తన భార్యతో కలిసి వెళ్లి సునీతను పరామర్శించానని చెప్పారు. సునీతను ప్రెస్ మీట్ పెట్టమని, అవినాశ్ ను డిఫెండ్ చేయమని తాను చెప్పలేదని సజ్జల అన్నారు. వివేకా కేసులో టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీబీఐ చెత్తగా విచారణ చేస్తుందనడానికి వివేకా కేసు ఉదాహరణ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు వివేకా చనిపోతే నష్టపోయేది వైసీపీ అని, అది చంద్రబాబుకు ఉపయోగం అని ఆరోపించారు.

ఈ ఇంగిత జ్ఞానం సీబీఐకి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, టీడీపీ కోణాన్ని సీబీఐ పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్ మాదిరి పాకిపోయాడని, వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని ఆరోపించారు. కథలో మలుపులకు తగ్గట్లు సునీత అదనపు సమాచారం ఇస్తూనే ఉన్నారని, గూగుల్‌ టేక్‌ అవుట్‌ విచారణకు పనికి రాదని సీబీఐకి ఇప్పుడు అర్థమైందని సజ్జల అన్నారు.