అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఏపీ సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత అమరావతి రాజధానిపై చర్చ తీవ్రతరం అయిన సంగతి తెలిసిందే. గతంలో అమరావతి పేరు కూడా ఎత్తని జగన్..ఇకపై మనందరిదీ అమరావతి అంటూ ప్రకటించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి జగన్ ప్రయోగించిన చిట్టచివరి అస్త్రం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమమని విమర్శిస్తున్నారు. త్వరలోని విశాఖకు రాజధానిని తరలిస్తానని జగన్, మంత్రులు చెబుతున్న నేపథ్యంలోనే అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికే కేంద్రం సంపూర్ణంగా కట్టుబడి ఉందని అన్నారు.
ఇక, అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం అంశం కోర్టులో ఉందని చెప్పారు. తాము పేదలు, అమరావతి రైతుల ఇద్దరి పక్షం అని, పేదలకు ఇళ్లు వద్దని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఆర్ 5 జోన్ లో జగన్ పట్టాలు ఇచ్చిన ఇళ్లకు ప్రతి ఇంటికి రూ.1.80 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదని చెప్పారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, ఏపీలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని, దొంగ ఓట్లు సృష్టించి గెలవాలనుకోవడం సరికాదని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై జగన్ కు ఎనలేని ప్రేమ ఉంటే…వారిపై దాడులు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిలో సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై రేప్ జరిగినా ఆమెకు న్యాయం జరగలేదని మండిపడ్డారు.
ఇక, తన సొంత ఇలాకా పులివెందులలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయని జగన్ అమరావతిలో 50 వేల ఇళ్లు కడతానంటే ఎవరు నమ్ముతారని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే జగన్ కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులకు వారి హక్కుగా ప్రభుత్వం ఇవ్వవలసిన ఫ్లాట్లను ఇవ్వలేదని, అటువంటి వారి భూములను ఉపయోగించుకునే హక్కు జగన్ ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates