కోడిక‌త్తి కేసులో జ‌గ‌న్ విన్న‌పాలు కొట్టివేత‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. ఆయ‌న‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జ‌రిగిన కోడిక‌త్తి దాడి కేసు గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికి నాలుగేళ్ల‌కుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జ‌నుప‌ల్లి శ్రీనివాస‌రావు అనే యువ‌కుడు ఇప్ప‌టికీ జైల్లోనే ఉన్నాడు. స‌రే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మ‌రోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఎన్ ఐఏ కోర్టు తోసిపుచ్చింది.

కోడి కత్తి కేసులో తదుపరి మ‌రింత లోతుగా దర్యాప్తు చేయాలని ‌జగన్ తరపు న్యాయ‌వాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఐఏ కోర్టులో(విజ‌య‌వాడ‌) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి‌షన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున‌ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1న నిర్ణ‌యిస్తామ‌ని కోర్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ కేసులో నిందితుడిగా జైలు జీవితం గ‌డుపుతున్న శ్రీనివాస‌రావు.. బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ.. కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. మొత్తంగా.. ఈ కేసు విచార‌ణ ఆగ‌స్టు 1కి వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, 2018 అక్టోబర్ లో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించి.. హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు. ఈ క్ర‌మంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయ‌న‌పై కోడిక‌త్తి దాడి జ‌రిగింది. అప్ప‌ట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఐఏ ద‌ర్యాప్తును అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే అప్ప‌గించింది.