దేశంలో ఏపీ నెంబ‌ర్ 1 : చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ దేశంలోనే నెంబ‌ర్ 1గా ఉంద‌ని అన్నారు. ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మే. అయితే.. ఏ విష‌యంలో అంటే.. గంజాయి పంట‌, ర‌వాణాల విష‌యంలో ఏపీ ముందుంద‌ని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఇదే వైసీపీ పాల‌న‌లో గొప్ప విష‌య‌మ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

“రాష్ట్రంలో గంజాయి పంట నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉంది. ఇవి మినహా అన్ని పంట‌లూ సంక్షోభంలో ఉ న్నాయి. సమస్యలు చెబితే రైతులపై మంత్రి ఎర్రిప‌ప్ప అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారు. ఇప్పుడు టమాటా ధరలు పెరగడానికి ఇదే కారణం. ముందు చూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పలు ఉండేవి కావు. రాష్ట్రంలో ప్రస్తుతం 93శాతం మంది రైతులు అప్పులపాలయ్యారు.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

రైతుపై సగటు అప్పు రూ.2.45 లక్షలపైనే ఉందని చంద్ర‌బాబు అన్నారు. తప్పుడు లెక్కలు చూపించడం లో జగన్‌ సిద్ధహస్తుడని దుయ్య‌బ‌ట్టారు. జగన్‌ అధికార వ్యామోహానికి రాష్ట్రం నాశ‌నం అవుతోంద‌ని విమ ర్శించారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రంగా ల్లోనూ సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు.

ఏపీలో భూముల ధరలు, వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నా ఈ సీఎంకు వినిపించ‌డం లేదా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రైతులపై అప్పుల భారం మోపి.. సీఎం మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడ‌ని.. అన్నారు. రైతుల భూమి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా? అని తాజాగా అమ‌రావ‌తిలో పేద‌ల‌కు భూములు పంపిణీ చేయడంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.