ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ఇండియా
అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు రెడీ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ అయిన.. విపక్షాలు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం కనుక లోక్‌సభలో ప్రవేశ పెడితే.. విపక్షాలకు పైచేయి లభించినట్టు అవుతుందని భావిస్తున్నారు.
లోక్‌సభ నిబంధనలలోని రూల్ 198 ప్రకారం.. అవిశ్వాస తీర్మానంపై ఎన్నిరోజులైనా చర్చించవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆయా చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. దీనిపై చర్చించే ముందు కాంగ్రెస్ సహా విపక్షాల పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాలపై చర్చించాలని బీజేపీ పట్టుబడుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా విపక్షాలు వ్యూహం మార్చుకున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే.. ఖచ్చితంగా అప్పుడు అన్ని అంశాలపైనా చర్చించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి.
పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్ లో జరిగిన కీలక సమావేశంలో… విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాన నిర్ణయం తీసుకొన్నాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా… మణిపూర్ సహా… పలు అంశాలపై చర్చించే అవకాశం దొరుకుతుందని ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.