మరికొద్ది నెల్లల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బతగి లింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సంచలన తీర్పును తాజాగా వెలువరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా హైకోర్టు నిర్ధారించింది. అదేసమయంలో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.
విషయం ఇదీ..
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఈయనపై బీఆర్ ఎస్ తరఫున జలగం వెంకట్రావు రంగంలోకి దిగారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు అంశాలు పేర్కొన్నారంటూ.. ఓడిపోయిన బీఆర్ ఎస్ నాయకుడు జలగం కోర్టుకు వెళ్లారు.
అనేక సార్లు విచారణ జరిగిన హైకోర్టుతాజాగా తుది తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులు ఉన్న మాట వాస్తవమేనని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అప్పట్లో 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వనమా విజయం సాధించారు.
కాగా, కాంగ్రెస్ తరఫున గెలిచినప్పటికీ.. కొన్నాళ్లకే వనమా. కేసీఆర్‌కు జైకొట్టారు. ఈ క్రమంలో అటు వనమా.. ఇటు జలగం ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. అయితే, తాజా తీర్పు ప్రకారం వనమా మాజీ అవుతుండగా.. జలగం ఎమ్మెల్యేగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.