ఈ నియోజ‌క‌వ‌ర్గాలు ఇంతే.. మార‌డం క‌ష్ట‌మే!

ఏపీలో అధికార పార్టీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుందా? లేదా.. అనే విష‌యం క‌న్నా ముందు క్షేత్ర స్థాయిలో మాత్రం రాజ‌కీయం వేడెక్కింది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగానే మారింది. స్థానిక నేత‌ల ఆధిప‌త్యాలు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ప్ర‌యోగాలు వంటివి.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళ‌న‌లు వెర‌సి.. వైసీపీ ప‌రిస్థితి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందుల్లోనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నందికొట్కూరు, హిందూపురం, ప్ర‌త్తిపాడు, రామ‌చంద్ర‌పురం, రాజ‌మండ్రి రూర‌ల్‌, పాత‌పట్నం, టెక్క‌లి, రాజంపేట‌, కోడూరు, గిద్ద‌లూరు, అద్దంకి, ప‌రుచూరు.. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వేసిన అడుగులు ఇప్పుడు స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవడం.. పార్టీని రోడ్డున ప‌డేయ‌డం వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా మారాయ‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ డెవ‌ల‌ప్ చేయాల్సిన బాధ్య‌త క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల‌పైనే ఉంది.

అయితే.. ఇప్పుడు సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌క‌న్నా కూడా ఎక్కువ‌గా రోడ్డున‌ప‌డి సొంత నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో వైసీపీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పలుచ‌న అయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో 6-7 మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. నాయ‌కులు క‌ల‌సి క‌ట్టుగా ఉండ‌క‌పోతే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌ర్థి ప‌క్షాలు పాగా వేయ‌డం ఖాయ‌మ నే సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

ఇప్ప‌టికైతే.. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేద‌ని.. ఎవ‌రికి వారు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.