పవన్, చంద్రబాబులది రాజకీయ ఆత్మహత్య

ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీతో బీజేపీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను తాను సెట్ చేస్తానని, మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీల మధ్య పవన్ రాయబారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు పొలిటికల్ సూసైడ్ కు ప్రయత్నిస్తున్నారని, మునిగిన పడవపై ప్రయాణిస్తున్నారని నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. తాము పవన్, చంద్రబాబుకు మద్దతివ్వబోమని తేల్చేశారు. పవన్‌, టీడీపీ కలిసి రాజకీయం చేస్తున్నారని, సీమ అభివృద్ధికి 50 కోట్లు ఇస్తానని ఒక్క కోటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని, బీజేపీతో కలిసే పార్టీలన్నీ తెలుగు ప్రజలకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే తమ మద్దతు ఎవరికో చెబుతామని, కమ్యూనిస్టు పార్టీగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటాయన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులలకు ముందు ఓటు వేసేది వైసీపీ అని ఆరోపించారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్రంలో దొంగలు, అరాచకాలు, దౌర్జన్యం, మాఫియా పెరిగిపోయాయని మండిపడ్డారు. కమ్యూనిస్టుల బలం తగ్గడంతో వల్లే పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారం కావడం లేదని, మణిపూర్ లో గిరిజనులను బెదిరించి 50వేల ఎకరాల భూమిని అదానీకి అప్పగించిందని ఆరోపించారు. బీజేపీతో జగన్ కలిసే ఉన్నారని అన్నారు.