ఈ వర్గాలనే కేసీయార్ టార్గెట్ చేశారా ?

ఇప్పటి రాజకీయమంతా నెగిటివ్ ట్రెండ్ మీదే నడుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపార్టీ మీద నెగిటివ్ ప్రభావం మరో పార్టీకి పాజిటివ్ అవుతోందంతే. అంతేకానీ జనాల్లో పాజిటివ్ ఓట్లతో గట్టెక్కే పార్టీలు, అభ్యర్దులు చాలా చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే కేసీయార్ కూడా ప్రభుత్వంపై నెగిటివ్ గా ఉన్న వర్గాలపైన దృష్టిపెట్టినట్లు సమాచారం. నెగిటివ్ వర్గాలను మంచి చేసుకుని పాజిటివ్ గా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే ముందుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులపై దృష్టిపెట్టారు. గడచిన తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ పై వర్గాలను అసలు పట్టించుకోలేదు. తెలంగాణా ఉద్యమంలో నిజానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులదే కీలకపాత్ర. అప్పట్లో వీళ్ళతో రెగ్యులర్ గా సమావేశమవుతూ, భేటీలు వేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దూరంగా పెట్టేశారు. రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అనుమానమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

అందుకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులను మంచి చేసుకునేందుకు కమిటిని ప్రకటించబోతున్నట్లు లీకులిచ్చారు. సంక్షేమ పథకాలు వాళ్లకు వర్తించేట్లుగా వరాలిస్తున్నారు. బదిలీలని, ప్రమోషన్లని, భార్య, భర్తలకు ఒకేచోట కొలువని ఏమిటేమిటో హామీలిచ్చేస్తున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు కూడా బాగా మండుతున్నాయి. అందుకే బీసీ బంధు, గొర్లె పంపిణీ అని, చేతివృత్తులకు ఆర్ధికసాయమని రకరకాల హామీలను గుప్పిస్తున్నారు. ఎస్సీలకు భూములని, ఎస్టీలకు పోడుభూములిచ్చేస్తామని హామీలిచ్చారు.

వివిధ కులాలు, కులవృత్తి సంఘాల నేతలతో కేసీయార్ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బీసీలతో ఒకటిరెండు సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీయార్ ప్రయత్నాలే కానీ అవెంత వరకు వర్కవుటవుతాయో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించిన దళితబంధు, రైతుబంధు పథకాలు ఎంత దివ్యంగా అమలవుతున్నాయో అందరు చూస్తున్నదే. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకే దళితబంధు ప్రకటించినా ఉపయోగం లేకపోయింది. దాంతో ఆ పథకాన్ని కేసీయార్ అటకెక్కించేశారు. ఆ పథకం ఎక్కడ నడుస్తోందో ఎక్కడ నడవటంలేదో కూడా తెలీదు. రైతుబంధు పథకం కూడా సేమ్ టు సేమ్. ఇప్పటికే నిరుద్యోగులు, విద్యార్ధులు మండిపోతున్నారు. మరి వీళ్ళని మంచి చేసుకునేందుకు ఏమి వరాలు ప్రకటిస్తారో చూడాలి.