వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తానని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే.. చంద్రబాబు ఎంత కాదనుకున్నా.. ఎంత ఔననుకున్నా.. కొందరు వారసులను తప్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అవసరం.. కూడా అనే టాక్ ఉంది. ఇలాంటి వారిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్‌కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి గాలి ముద్దుకృష్ణమ కుమారుడు గాలి భాను ప్రకాశ్ నాయుడు ఉన్నారు.
అదేవిధంగా ఉమ్మడి అనంతపురంలోని రాప్తాడు/ ధర్మవరం నుంచి పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంలు పోటీకి రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ వీరు పోటీ చేశారు. అయితే.. ఎంత వారసులైనా.. ప్రజలను మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా! ఈ విషయంలో ఎక్కడో తేడా కొట్టింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వీరి ప్రభ ముందుకు సాగలేదు. అయితే.. ఇప్పుడు మరోసారి వీరు టికెట్‌ల కోసం ప్రయత్నాలు చేయడం.. కొందరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి చర్చకు వచ్చారు.
శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాల కృష్ణారెడ్డి రికార్డు స్థాయిలో వరుసగా 7 సార్లు విజయం దక్కించుకున్నారు. మంత్రి అయ్యారు. ఆయన వారసుడిగా రంగంలోకి వచ్చిన సుధీర్ మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం.. పార్టీని బలోపేతం చేసే క్రమంలో పాత కాపులను చంద్రబాబు తిరిగి చేర్చుకున్నారు. దరిమిలా ఇక్కడ టీడీపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ.. సుధీర్ ఇమేజ్ మాత్రం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు పరిశీలకులు.
నగరిలో ప్రత్యామ్నాయం లేని టీడీపీ మరోసారి గాలి భానుకే టికెట్ ఇస్తోంది. అయితే.. సేమ్ టు సేమ్.. ఇక్కడ కూడాముద్దు కృష్ణమ హవాను ఆయన అందిపుచ్చుకోలేక పోతున్నారనే వాదన ఉంది. బలమైన నాయకురాలు.. ప్రస్తుతం మంత్రి రోజా కు అసమ్మతి పెరిగిన నేపథ్యంలో ఆ వ్యతిరేక ఓటు ఇటు పడితే.. తప్ప గెలుపు సాధ్యం కాదనే అంచనాలు వస్తున్నాయి. అయితే.. భాను ప్రజల్లో ఉంటే.. కొంత మెరుగవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. తండ్రి వారసత్వం.. ఈ సారైనా నిలబెడతారో లేదో చూడాలి.