గ్రూపు తగాదాలపై సీరియస్

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పార్టీలో గ్రూపు తగాదాలకు చెక్ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లే ఉన్నారు. గ్రూపు రాజకీయాలపై బాగా సీరియస్ అయినట్లే ఉంది. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో కూడా నేతలు గ్రూపులు కట్టి గొడవ పడుతున్నట్లు అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు తాజా ఉదాహరణ కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గమే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఎంఎల్ఏ ఆర్థర్. అయితే ఇక్కడ పెత్తనమంతా తానే చేయాలన్నట్లుగా మరోనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఎంఎల్ఏగా తాను చెప్పినట్లే జరగాలని ఆర్ధర్, తాను బలమైన నేత కాబట్టి తన మాటే చెల్లుబాటు కావాలని బైరెడ్డి గొడవలు పడుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా గొడవలవుతున్నాయి. ఈ పంచాయితీలో జగన్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం ఎంఎల్ఏకే ప్రయారిటీ ఉంటుందని తేల్చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరికీ క్లాసుపీకారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితో క్రమశిక్షణ తీసుకోవటంలో వెనకాడేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఇంతకుముందు రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విషయంలో కూడా జగన్ ఇలాగే వార్నింగ్ ఇచ్చారు. ఎంఎల్ఏగా చెల్లుబోయిన ఉన్నపుడు రాబోయే ఎన్నికల్లో కొడుకును పోటీచేయించాలని అనుకున్నావంటు పిల్లిని జగన్ వాయించేశారు. అభ్యర్ధిగా తాను డిసైడ్ చేసిన తర్వాత సమస్యలుంటే తనకు చెప్పుకోవాలి కానీ నియోజకవర్గంలో గ్రూపులు కట్టి గొడవలు చేయటం ఏమిటని నిలదీశారు. అంతకుముందు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి కూడా ఇలాగే క్లాసు పీకారు.

గ్రూపు తగాదాల పరిష్కారంలో జగన్ చాలా కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. తనకు ఎంతటి సన్నిహితులైనా పార్టీకి నష్టం చేస్తున్నారని అనుకుంటే వార్నింగులు ఇవ్వటంలో వెనకాడటంలేదు. పార్టీలో కంపుచేస్తున్నారన్న కారణంగా కోటంరెడ్డి శ్రీధరరెడ్డి లాంటి సన్నిహితుడినే వదులుకోవటానికి ఆలోచించలేదన్న విషయాన్ని జగన్ సంకేతాలు పంపుతున్నారు. పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తారని అనుకుంటే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దాంతో జగన్ నిర్ణయాలను ఆమోదించే వాళ్ళయితే పార్టీలో ఉంటారు లేకపోతే బయటకు వెళ్ళిపోవటమే మార్గమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి నేతలు వార్నింగులతో మారుతారా ?